తెలుగు సినిమా పూర్తిగా మల్టీప్లెక్స్ ట్రెండ్‌లో మునిగిపోయింది. రోజూ మూడు ఆటలు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. తర్వాత రోజుకు నాలుగు ఆటలు చాలామందికి తెలుసు. మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చాక షోస్ సంఖ్య పెరిగిపోయింది. ఇంకోపక్క పెద్ద సినిమాలకు అదనపు షోలు వేస్తుండడం మామూలే అయినా, ప్రభుత్వాలు అదనపు షోలకు వీలుగా అనుమతులు ఇస్తుండడం, తద్వారా వీలైనంత ఎక్కువ మందిని, అతితక్కువ రోజుల్లో ధియేటర్స్‌కి రప్పించేందుకు వీలు కల్గుతోంది.
అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఎక్స్‌ట్రా షోలు ఆయా సినిమాల్ని దారుణంగా దెబ్బ తీస్తుంటాయి. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకే ఇది లాభం. ఓ మోస్తరు సినిమాలకు ఈ ఎక్స్‌ట్రా షోలు కొంతమేరకు నష్టాన్ని కలిగిస్తాయి. ఫ్లాప్ సినిమాల సంగతి ఘోరం. 'అజ్ఞాతవాసి'కి అలాంటి పరాభవమే ఎదురైంది. అయితే ఆ ఎక్స్‌ట్రా షోల వల్ల మాగ్జిమమ్ గుంజుకున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఆ విషయం పక్కన పెడితే, నందమూరి తారక రాముడి బయోపిక్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కూడా కావడంతో ఈ సినిమాకి అక్కడ టీడీపీ శ్రేణులు, టీడీపీ ప్రభుత్వం అదనపు హంగామా కల్పిస్తోంది. మరోపక్క 'వినయ విధేయ రాముడి'కి కూడా అదనపు షోల పరంగా వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 9న విడుదలవుతోంటే, 'వినయ విధేయ రామ' 11న విడుదలవుతోంది. ఎక్స్‌ట్రా షోస్‌తో బాలయ్య మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా పండగ చేసుకోవచ్చు. రెండు సినిమాలూ హిట్టై తెలుగు సినిమాకి ఈ సంక్రాంతి వసూళ్ల కళ తీసుకురావాలని ఆశిద్దాం.