'వినయ విధేయ రామ' సినిమాకి సంబంధించి ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాల్లో 'టాటూ' ఒకటి. రామ్ చరణ్ ఛాతీపై ఓ భారీ టాటూ కనిపిస్తోంది. ఈస్థాయిలో ఓ హీరో కి టాటూ వేయడం బహుశా టాలీవుడ్ లో ఇదే తొలిసారి. అయితే ఆ టాటూ వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉందని టాలీవుడ్ టాక్. అదేంటో తెరపైనే చూడాలని చిత్రబృందం ఊరిస్తోంది. ఈ టాటూ వేయించుకోవడానికి చరణ్ చాలానే కష్టపడ్డాడట. రోజూ ఉదయమే టాటూ వేయడానికి గంట టైమ్ పట్టేదట. మళ్లీ దాన్ని చెరిపేయడం మరో ప్రహసనం. అసలు ఆ టాటూ గురించి తలచుకుంటేనే నీరసం వచ్చేస్తోంది అంటున్నాడు చరణ్.
''రెండేళ్ల క్రితమే బోయపాటి నాకు ఈ టాటూ గురించి చెప్పారు. ఇప్పటి వరకూ నేను అంత పెద్ద టాటూ వేసుకోలేదు. బ్రూస్లీలో చేతిపై చిన్న టాటూ ఉంటుంది. ఇది చాలా పెద్ద టాటూ. తీయడానికి, వేయడానికి రెండు గంటల సమయం పట్టేది. పైగా అజయ్ బాయ్ జాన్లో 9 డిగ్రీల చలిలో షూటింగ్ చేశాం. వంటిమీద చొక్కా కూడా ఉండేది కాదు. అంత చలిలో టాటూ వేయించుకోవడం చాలా కష్టంగా అనిపించేది'' అంటూ టాటూ గుట్టు విప్పాడు చెర్రీ.