సీనియర్ హీరోయిన్ తమన్నా, జూనియర్ మెహ్రీన్ ఇద్దరూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈవెంట్‌కి డుమ్మా కొట్టేశారు. సినిమా ప్రమోషన్ అనేది సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరి బాధ్యత. ప్రమోషనల్ ఈవెంట్ అన్నప్పుడు అందులో హీరోయిన్లూ పాలు పంచుకోవాలి. ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒకరికి వీలు కాకపోతే, ఇంకొకరైనా వచ్చి ఉండాల్సింది. పైగా ఇది విశాఖలో జరిగింది.
విశాఖ ఉత్సవ్‌లో 'ఎఫ్ 2' ఈవెంట్‌ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హీరోయిన్లకు అంత చిన్న చూపా అన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా తమన్నా ఓ వీడియో విడుదల చేసింది.. రాలేకపోతున్నానని. అయినా కానీ, సినీ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. మరోపక్క విక్టరీ వెంకటేష్ కార్యక్రమంలో ఫన్ ఉన్నా, వేదిక మీద కొంత ఫ్రస్టేషన్ ఉంది.
అందుకు కారణం మొగుళ్లు వచ్చారు, కానీ పెళ్లాలు రాలేదు అని అన్నారు. సీనియర్ నటుడు కదా.. కొంచెం ఫన్ జోడించి హుందాగా వ్యాఖ్యానించాడు. ఇంకొకరైతే కడిగి పారేసేవారే. సినిమాలో తమన్నా వెంకటేష్ భార్యగా నటిస్తే, మెహ్రీన్ వరుణ్ భార్యగా నటించింది. ఫంక్షన్లో గ్లామర్ లేదన్న లోటే కానీ, వెంకటేష్, వరుణ్ తమ అల్లరితో ఈవెంట్‌కి ఫుల్ జోష్ ఇచ్చారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ.