కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'ఎన్టీఆర్ బయోపిక్'. రెండు పార్టులుగా విడదులవుతోన్న 'ఎన్టీఆర్ బయోపిక్'కి సంబంధించి ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9న డేట్ కన్‌ఫామ్ చేసుకుంది. అయితే, ఈలోగా సినిమాపై వివాదాలు పీక్స్‌కి వెళ్ళిపోతున్నాయి. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, 'ఎన్టీఆర్ బయోపిక్' టీమ్‌కి నోటీసులు పంపారు. తనను సినిమాలో నెగెటివ్ యాంగిల్‌లో చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారాయన.
అయితే ఈ వివాదం 'ఎన్టీఆర్ కథానాయకుడు'కి ఎలాంటి ఇబ్బందులు కలిగించదనీ, రాజకీయ అంశాలు కేవలం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాకే పరిమితమవుతాయనీ, 'ఎన్టీఆర్ కథనాయకుడు'లో రాజకీయ అంశాలు వుండవనీ తెలుస్తోంది. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో కూడా నెగెటివ్ అంశాల జోలికి అస్సలు వెళ్ళలేదట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇదే నిజమని తెలుస్తోంది. కానీ, బయట జరుగుతున్న ప్రచారం వేరు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర చాలావరకు తెరచని పుస్తకమే. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా స్వర్గీయ ఎన్టీఆర్ ఎదిగిన వైనం అందరికీ తెలుసు. ఆయన రాజకీయ ప్రస్థానం, ముగింపు జీవితం.. ఇవన్నీ తెలిసిన సంగతులే. వాటిని విస్మరించి సినిమా తీస్తే, అది పరిపూర్ణ జీవిత చరిత్ర కాబోదు. అన్నిటినీ చూపిస్తే, ఆయన గౌరవాన్ని తగ్గించినట్లవుతుంది కూడా. మరి, 'ఎన్టీఆర్ బయోపిక్' టీమ్ ఏం చేసిందో చూడాలిక.!