మేధావులు మౌనంగా ఉండకూడదు. సత్తా ఉన్నవాళ్లు చేతులు కట్టుకుని నిలబడకూడదు. పవన్ కల్యాణ్ చెప్పే మాట ఇదే. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చాడు. తనకు చేతనైంత ప్రజా సేవ చేస్తున్నాడు. అయితే పవన్ అభిమానులు మాత్రం `సినిమాల్లోనూ నీ పవర్ చూపించు అన్నా` అని మళ్లీ ఆహ్వానిస్తున్నారు. అటు సినిమాలూ - ఇటు రాజకీయాలూ అంటూ జోడు గుర్రాల స్వారీ చేయలేనని పవన్ చెబుతున్నాడు. కాకపోతే... రాజకీయాల్లో పవన్ ఎంత అవసరమో, సినిమా రంగానికీ తను అంతే అవసరమని పవన్ అభిమానులు చెబుతున్నారు.
ఆ మాట నిజం కూడా. సినిమా వందల మందికి అన్నం పెడుతుంది. వేల కుటుంబాల్నిపరోక్షంగా బతికిస్తుంటుంది. అందుకే సినిమా ఓ పరిశ్రమగా మారింది. పవన్ లాంటివాడు సినిమా చేస్తే పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. తన సినిమా హిట్టయితే - తెలుగు సినీ రూపు రేఖలు మారిపోతాయి. తన కోసం కాకపోయినా, తన అభిమానుల కోసమైనా, సినీ కార్మికుల కోసమైనా పవన్ సినిమాలు చేయాలి. పవన్ ఎప్పుడూ ఏడాదికి ఒక సినిమాకి మించి ఇవ్వలేదు. ఒక్కోసారి రెండేళ్లు కూడా పట్టేది. అయినా పవన్ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూసేవాళ్లూ. ఇప్పుడు కూడా వాళ్లు అడిగేది ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే.
పవన్ కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలో ఉన్నారు. వపన్ ఓకే అంటే చాలు. సినిమాని పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నారు. రాజకీయాల పరంగా కాస్త స్థబ్దత ఏర్పడిన ఈ తరుణంలో ఈ సమయాన్ని పవన్ సినిమాల కోసం మళ్లించడంలో తప్పు లేదు. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టే సత్తా పవన్‌లో ఇంకా ఉంది. తన సినిమా వస్తోందంటే రాజకీయాల్ని పక్కన పెట్టి - తెలుగు సినీ ప్రియులంతా ఒక్కటవుతారు. అందుకోసమైనా పవన్ సినిమాలు చేయాలన్నది అభిమానుల కోరిక. పవన్ తన అభిమానుల మాట ఎప్పుడూ కాదనలేదు. ఈ కోరికా త్వరలోనే మన్నిస్తాడేమో చూడాలి. అన్నట్టు.. హ్యాపీ బర్త్‌డే టూ.. పవర్ స్టార్!!