అందరినోటా సాహో మాటే. విడుదలకు ముందు సాహో.. సాహో అంటూ కలవరించారు. విడుదలైన తరవాత కూడా సాహో నామ జపమే చేస్తున్నారు. ఈసినిమా బాగుందని కొందరు, బాగోలేదని డిజాస్టరని కొందరు వాదించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ నెగిటీవ్ రివ్యూలపై విరుచుకుపడిపోతూ `మా సినిమా వసూళ్లు చూడండి` అంటూ లెక్కలు చెబుతున్నారు. సాహో రెండు రోజులకు 200 కోట్లు దాటేసిందని కలక్షన్ల చిట్టా విప్పుతున్నారు.
అయితే... ఇవి నిజం లెక్కలు కావని, ఈ వసూళ్లన్నీ అంకెల గారడీనేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి రోజు సాహో వసూళ్లు బాగానే ఉన్నా - చాలా చోట్ల బాహుబలి రికార్డులకు దరిదాపుల్లో కూడా వెళ్లలేదని, ఓవర్సీస్‌లో ఆశించినంత సంఖ్యలో కలక్షన్లు రాలేదని చెబుతున్నారు. నైజాం ఏరియాలో ప్రకటించిన వసూళ్లకీ, వచ్చినవాటికీ అస్సలు పొంతన లేదని ట్రేడ్ పండితులు లెక్కగడుతున్నారు. నెగిటీవ్ టాక్ వస్తే ఎక్కడికక్కడ వసూళ్లు పడిపోతాయని, కానీ.. చిత్రబృందం మాత్రం వసూళ్లు ఎక్కువ వేసుకుని చెబుతున్నాయని విమర్శిస్తున్నారు.
రెండోరోజు సాహో వసూళ్లు దారుణంగా పడ్డాయని, ఆదివారం కూడా ఇదే కొనసాగుతుందని జోస్యం చెబుతున్నారు. పెద్ద సినిమా వచ్చినప్పుడు, రికార్డు వసూళ్లు సాధిస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు చెలరేగడం మామూలే. నిజానిజాలేంటో కాలమే చెబుతుంది.