బయోపిక్‌ల పరంపర నడుస్తోంది. కాదేదీ బయోపిక్‌కి అనర్హం అంటూ.... కాస్త క్రేజ్ కనిపించిన జీవిత కథలన్నీ తెరపైకి వచ్చేస్తున్నాయి. సినిమా తారలు, క్రీడా కారుల జీవిత కథలకు డిమాండ్ బాగా ఎక్కువైంది. క్రికెటర్ల కథైతే.. దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. అందుకే వాళ్ల జీవితాలే ఎక్కువగా తెరపై కనిపిస్తున్నాయి. తాజాగా సౌరభ్ గంగూలీ జీవితం కూడా సినిమాగా రాబోతోందని తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. గంగూలీ రాకతో భారత క్రికెట్ లో కొత్త అధ్యాయం మొదలైంది.
ప్రయోగాలు చేయడానికి, ప్రత్యర్థిని మాటలతో బెదరగొట్టడానికీ గంగూలీ వెనుకాడేవాడు కాదు. కెప్టెన్‌గా తన కెరీర్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అవి భారత క్రికెట్ జట్టుకు ఎంతో మేలు చేసింది. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని నెరవేరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గంగూలీ జీవిత కథకు డిమాండ్ ఏర్పడింది. కరణ్ జోహార్ గంగూలీ జీవితంపై సినిమా తీయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారతీయ చలన చిత్రసీమలో ఓ సూపర్ కాంబోకి రంగం సిద్ధమైనట్టే.