'కథానాయకుడు' సినిమా కొన్న బయ్యర్లకు ఇది శుభవార్త. ఈ సినిమాతో పంపిణీదారులంతా 50 కోట్లు నష్టపోయారు. ఈ నష్టపరిహారాన్ని బాలయ్య చెల్లిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. బాలయ్య కేవలం 25 శాతమే నష్టపరిహారం చెల్లించబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే వీటిపై చిత్రబృందం స్పందించింది. అంతేకాదు... నష్టపరిహారం వివరాల్ని అధికారికంగా ప్రకటించింది. కథానాయకుడుతో నష్టపోయిన వాళ్లందరికీ 33 శాతం నష్టపరిహారం చెల్లించడానికి కథానాయకుడు, నిర్మాత నందమూరి బాలకృష్ణ సిద్ధమయ్యారు.
అంతేకాదు.. `మహానాయకుడు` చిత్రాన్ని కూడా ఆ పంపిణీదారులకే ఇవ్వబోతున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఆదాయంలో 40 శాతం బయ్యర్లకు ఇచ్చి, మిగిలిన 60 శాతం చిత్రబృందం తీసుకోబోతోంది. ఓ రకంగా.. ఇది బయ్యర్లకు ఉపశమనం కలిగించే వార్తే. కథానాయకుడు ద్వారా పోగొట్టుకున్నదంతా.. రాబట్టుకొనే మంచి అవకాశం. బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల పంపిణీదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 22న `మహానాయకుడు` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.