ఎన్టీఆర్ బయోపిక్ లోని తొలి భాగం 'కథానాయకుడు' పంపిణీదారులు భారీ నష్టాల్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దాదాపు 50 కోట్లు నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి 'మహానాయకుడు' సినిమాని ఫ్రీగా ఇచ్చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడు. అప్పటికీ.. బయ్యర్ల నష్టాలు భర్తీ కావు. ఎందుకంటే `కథానాయకుడు`కి రూ.20 కోట్లు మాత్రమే వచ్చాయి. 'మహానాయకుడు' అటూ ఇటూ అయితే ఆ మాత్రం కూడా రావు. అందుకే... బయ్యర్లు ఇంకా భయం భయంగానే ఉన్నారు.
'మహానాయకుడు' వచ్చి వెళ్లాక.. బాలయ్య మళ్లీ కరుణిస్తాడని, ఎంతో కొంత తిరిగి ఇస్తాడని ఆశించారు. అయితే ఇప్పుడు మొదటికే మోసం వచ్చేట్టు కనిపిస్తోంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' నష్టాల్ని బాలయ్య మరోలా భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బయ్యర్లందరినీ పిలిచి, వాళ్లకొచ్చిన నష్టాలలో 25 శాతం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. 'మహానాయకుడు' కావాలంటే మాత్రం డబ్బులిచ్చి మళ్లీ కొనుక్కోవాల్సిందే. ఇది నిజంగా బయ్యర్లకు షాక్‌కి గురిచేసే విషయమే.
'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫ్రీగా వస్తే, ఆ వసూళ్లతో కాస్తో కూస్తో అప్పులు తీరతాయి అనుకుంటే... బాలయ్య ఇప్పుడు లిటికేషన్ పెట్టేశాడు. ఎంతో కొంత వచ్చిందిలే అని ఆ 25 శాతం తీసుకుంటే, `మహానాయకుడు`ని కొనడానికి మళ్లీ డబ్బులు పెట్టాలి కదా? ఎప్పుడూ మాట మీద ఉండే బాలయ్య, ఇలా సడన్‌గా మాట మారుస్తాడని వాళ్లకేం తెలుసు. మరి పంపిణీదారులు 25 శాతం వెనక్కి తీసుకుంటారా? లేదంటే... 'మాకిది సరిపోదు' అని గట్టిగా డిమాండ్ చేస్తారా? వేచి చూడాల్సిందే.