'జిల్', 'సౌఖ్యం', 'గౌతం నంద', 'ఆరడుగుల బుల్లెట్', 'పంతం'..... ఇలా వరుసగా ఫ్లాపులు తెచ్చుకున్న హీరో గోపీచంద్. ఇంత డౌన్ ఫాల్‌లో గోపీచంద్ కెరీర్ ఎప్పుడూ లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కిపోతోంది. బయ్యర్లకు, నిర్మాతలకూ తీవ్ర నష్టాల్ని మిగులుస్తోంది. ఇలాంటి దశలోనూ గోపీచంద్‌కి అవకాశాలు రావడం గ్రేటే అనుకోవాలి.
ఇప్పుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాపై దాదాపుగా రూ.35 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. గోపీచంద్ కెరీర్‌లో ఇంత మొత్తాన్ని రాబట్టిన సినిమా ఇప్పటి వరకూ రాలేదు. పైగా తను ఫ్లాపులలో ఉన్నాడు. గౌతమ్ నందని రూ.25 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారు. గోపీ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ చిత్రమదే. ఆ డబ్బులే వెనక్కి రాలేదు.
అలాంటిది రూ.35 కోట్లతో సినిమా తీయడం నిజంగా అత్యంత సాహసమే అనుకోవాలి. ఇదో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రస్తుతం ఇండో పాక్ సరిహద్దులలో చిత్రీకరణ జరుపుకొంటోంది. దేశ వ్యాప్తంగా అరుదైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనుంది. అందుకోసమే ఈ స్థాయిలో డబ్బు ఖర్చు పెడుతున్నారట. తిరు కథపై నమ్మకమో, లేదంటే... గోపీచంద్ ఈసారి ఎలాగైనా హిట్టు కొడతాడన్న ధీమానో తెలీదు గానీ... మొత్తానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పెద్ద రిస్కే చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.