తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర నిర్మాతలు ఉన్నారు. వాళ్ళందరిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అరవింద్.. నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో నటుడిగా కొన్ని సినిమాలు చేసిన అల్లు అరవింద్.. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ముఖ్యంగా చిరంజీవి హీరోగా నిర్మించిన విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు ఇలాంటి ఎన్నో చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. చిరంజీవి తరం తర్వాత వచ్చిన వారసులతోనూ సినిమాలు నిర్మించారు. తనయుడు అల్లు అర్జున్ ను గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం చేశారు ఈయన. రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాతో తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచారు ఈ నిర్మాత. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి 40 కోట్ల బడ్జెట్ పెట్టి 70 కోట్లకు పైగా వసూలు చేసిన ఘనత అల్లు అరవింద్ కి దక్కింది.
హిందీలో అమీర్ ఖాన్ లాంటి హీరోతో గజిని సినిమా నిర్మించి 100 కోట్ల మార్క్ కు శ్రీకారం చుట్టారు ఈ మెగా ప్రొడ్యూసర్. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి 1000 థియేటర్ల ట్రెండ్ పరిచయం చేసారు. కేవలం మెగా హీరోలతోనే కాకుండా నాని, శర్వానంద్ ఇలాంటి హీరోలతో కూడా సంచలన సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. ఇప్పటికీ వరస సినిమాలు నిర్మిస్తూ గీతా ఆర్ట్స్ ను తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక సంస్థగా నిలబెట్టారు అల్లు అరవింద్. 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.