'షాక్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్ అభిరుచి గల సినిమాలను తెరకెక్కిస్తూ 'గబ్బర్‌సింగ్' సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డైరెక్టర్స్ రేంజ్‌కి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత హరీష్ శంకర్ ఒకటి రెండు సూపర్ హిట్స్ తప్ప ఆ స్థాయి హిట్‌ని టచ్ చేయలేకపోయాడు. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' హరీష్ శంకర్‌ని బాగా నిరాశ పరిచింది.
ఆ తర్వాత హరీష్ శంకర్ 'వాల్మీకి' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మంచి క్రియేటివ్ విజన్ ఉన్న దర్శకుడు. అందుకే ఆయన క్రియేటివిటీ మరుగున పడిపోకుండా అభిరుచి గల సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నాడట. ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి కొన్ని సినిమాలను నిర్మించే యోచన చేస్తున్నాడట.
ఆ సినిమాలకు స్క్రిప్టు తానే అందించబోతున్నాడట హరీష్ శంకర్. ఆల్రెడీ టాలీవుడ్‌లో ఈ రకంగా డైరెక్షన్ చేస్తూ, ఇతర సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్ హరీష్‌కి ఇన్స్‌ప్రేషన్ అనుకోవచ్చు. త్వరలోనే హరీష్ శంకర్ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నాడట హరీష్ శంకర్.