రచయిత నుండి దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ నిన్నటి నుండి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇదేదో సినిమాకి సంబంధించి కాదు, ఆయన చేసిన ఒక మంచి పని ఆయనని ఈరోజు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా చేసింది.
ఆ వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూములున్న రైతులకి పంట వేసుకునే విధంగా ఎకరానికి రూ 4000/- చొప్పున అందచేస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు హరీష్ శంకర్ కి కూడా ప్రభుత్వం నుండి ఆ నగదు అందింది.
అయితే తనకి ఆ డబ్బు అవసరం లేదు అని, అదృష్టవశాత్తు తన వద్ద తగినంత డబ్బు ఉండడం వల్ల తనకి ప్రభుత్వం నుండి వచ్చిన ఈ నగదుని తిరిగి వారికే ఇచ్చేస్తూ ఆ మొత్తానికి తన వంతుగా మరికొంత సహాయం అందచేశాడు.
ఈ డబ్బుని అవసరమున్న మరే ఇతర రైతుకి ఇవ్వమని సంబందిత అధికారులని, సర్పంచ్ ని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు హరీష్ శంకర్ చేసిన పనికి అభినందనలు చెబుతున్నారు.