‘గబ్బర్‌సింగ్’ సినిమాకి సంబంధించి నిర్మాత బండ్ల గణేష్‌కీ, దర్శకుడు హరీష్ శంకర్‌కీ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. అదీ సినిమా విడుదలైన చాలా ఏళ్ళ తర్వాత. ‘గబ్బర్‌సింగ్’ సినిమా విడుదలై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో, హరీష్ ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గురించీ, దేవిశ్రీ ప్రసాద్ గురించీ ప్రస్తావించాడు. కానీ, నిర్మాత బండ్ల గణేష్‌ని లైట్ తీసుకున్నాడు. ఇదీ అసలు వివాదం. ఈ విషయమై నొచ్చుకున్న బండ్ల గణేష్, ఓ ఇంటర్వ్యూలో ‘అది అతని సంస్కారం’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. అంతేనా, హరీష్ శంకర్‌కి స్ట్రెయిట్ సినిమాలు తీయడం రాదని తేల్చేశాడు. మరోపక్క,
వివాదం ముదిరి పాకాన పడ్డంతో, హరీష్ శంకర్.. చొరవ చూపించి, బండ్ల గణేష్ నిర్మాణ దక్షతను కొనియాడుతూ ఓ ట్వీటేశాడు. ‘నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశాడు హరీష్ శంకర్. మరోపక్క, బండ్ల గణేష్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, ఆయనకు సమాధానం చెప్పడానికైనా పవన్ కళ్యాణ్‌తో ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ చెయ్యాలని ఓ అభిమాని కోరితే, సినిమా అనేది ప్యాషన్ అనీ, ఏ వ్యక్తికో సమాధానం చెప్పడానికి కాదనీ, సినిమా చేసేటప్పుడు మనకి మనం సమాధానం చెప్పుకోవాల్సి వుంటుందనీ తనదైన స్టయిల్లో సమాధానమిచ్చాడు హరీష్ శంకర్. ఈ వివాదం ప్రస్తుతానికి ఇక్కడితో ఆగినట్లే భావించాలేమో.