చిరంజీవి పాత సినిమా టైటిళ్లనీ, హిట్ గీతాల్నీ ఎడా పెడా వాడేసుకుంటుంటారు మెగా హీరోలు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్‌లు ముందుంటారు. చిరు పాటల్నీ, టైటిళ్లనీ మళ్లీ మళ్లీ గుర్తు చేసేది వీళ్లే. 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ వాడుకోవాలని చరణ్, సాయిధరమ్ తేజ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
'వినయ విధేయ రామ'కి ఒకానొక సందర్భంలో గ్యాంగ్ లీడర్ అనే పేరు పెట్టాలనుకున్నారు. మరి ఎందుకనో మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. 'గ్యాంగ్ లీడర్' తరహాలో ఓ మాస్ సినిమా చేయాలన్నది సాయిధరమ్ తేజ్ ప్లాన్. అందుకు ఓ పక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీరిద్దరికీ యంగ్ హీరో నాని షాక్ ఇచ్చాడు.
తన తాజా సినిమాకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టి.. ఈ టైటిల్‌ని మరోసారి వాడుకునే అవకాశం లేకుండా చేశాడు. పాత సినిమాల పేర్లని వాడుకోవడం నానికి కొత్తేం కాదు. జెంటిల్‌మెన్, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు ఇవన్నీ పాత టైటిల్లే. మరి 'గ్యాంగ్ లీడర్' నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.