రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మిఠాయి' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అడల్ట్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఈ సందర్భంగా నటుగు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'మిఠాయి' సక్సెస్ కాలేనందుకు ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు.
ఇకపై ఇలాంటి సినిమాల్లో నటించనని భరోసా ఇచ్చాడు. ఈ మధ్య అడల్ట్ కామెడీ చిత్రాలు కుప్పలు తెప్పలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోలు అయితే కొత్తగా దిగుమతి అవుతున్నారు. లేదంటే, కామెడీతో గిలిగింతలు పెట్టించిన నటులు ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి చెక్కిలిగింతలు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈ అడల్ట్ కామెడీ చిత్రాలతో కమెడియన్స్ తమపై ఉన్న గౌరవాన్ని చెడగొట్టుకుంటున్నారు.
కమెడియన్ మిర్చి హేమంత్ అంటే స్వచ్ఛమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్. అలాంటి మిర్చి హేమంత్ ఈ మధ్య 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చిన కారణంగా నెటిజన్స్ నుండి దారుణమైన విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి తెలిసిందే. తాజాగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా ఇదే ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తున్నారట. దాంతో రాహుల్ రామకృష్ణ కాస్త ముందుగానే తేరుకొని ఓపెన్‌గా ఫ్యాన్స్‌కి సారీ చెప్పేశాడు.