ఈ యేడాది డబ్బింగ్ సినిమాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. బడా బడా స్టార్లే బోల్తా కొట్టారు. రజనీకాంత్ '2.ఓ' కూడా నిర్మాతల్ని నష్టాల్లో ముంచింది. అయితే కన్నడ సినిమా `కేజీఎఫ్` అనూహ్యమైన లాభాలతో ఆశ్చర్యపరిచింది. యశ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈ సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే సరైన పబ్లిసిటీ దొరకలేదు. పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలతో పాటు విడుదల అవ్వడం వల్ల.. అనుకున్న థియేటర్లు కూడా దొరకలేదు. రివ్యూలు కూడా సోసోగానే వచ్చాయి. దాంతో కేజీఎఫ్ ఫ్లాప్ అని అంతా నిర్దారించేశారు.
కానీ ఈ సినిమా అనూహ్యంగా పుంజుకుంది. రోజు రోజుకీ వసూళ్లు బలపడుతూ మరింతగా దూసుకుపోతోంది. వారాంతం కాకపోయినా హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సులు కిటకిటలాడిపోతున్నాయి. దాదాపు ప్రతీ షో హౌస్ ఫుల్‌గా సాగుతోంది. బీసీలలోనూఇదే తీరు. గత వారం విడుదలైన సినిమాలలో కేసీఎఫ్‌దే అగ్రస్థానం. రూ.5 కోట్ల అవుట్ రేటుకి ఈ సినిమాని కొనుగోలు చేశారు. ఇప్పటికే.. పెట్టుబడి తిరిగొచ్చేసి లాభాలు తెచ్చుకుంది. టోటల్ రన్ పూర్తయ్యేసరికి రూ.15 కోట్ల వరకూ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే... రూపాయికి మూడు రూపాయల లాభం అన్నమాట. ఆ లెక్కన కే జీ ఎఫ్ బంపర్ హిట్టు కొట్టిందనే అనుకోవాలి.