ఇలియానా తెలుగు సినిమాల్లోకొచ్చి చాన్నాళ్ళే అయ్యింది. దాదాపు దశాబ్దకాలం క్రితం ఆమె 'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో బోల్డన్ని సినిమాలు కూడా చేసింది. కానీ, ఈ బెల్లీ బ్యూటీ ఇప్పటిదాకా తెలుగులో డబ్బింగ్ చెప్పింది లేదు. అసలు తెలుగులో మాట్లాడేందుకూ ఇలియానా సీరియస్‌గా ప్రయత్నించిన దాఖలాల్లేవు.
ఎందుకిలా? ఏమో, ఆమెకే తెలియాలి. కానీ, చాలామంది హీరోయిన్లు తెలుగులోకి వస్తూనే, తెలుగు నేర్చేసుకుని.. తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలియానా కూడా తనను తాను మార్చుకుంది. తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటోంది. తొలిసారిగా ఆమె 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా కోసం డబ్బింగ్ చెబుతుండడం గమనార్హం. సొంత డబ్బింగ్ చాలామంది హీరోయిన్లకు మొదట కష్టంగానే వుంటుందిగానీ, అలా డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ వుంటాయన్నది అందరికీ తెలిసిన సంగతే.
సినిమాలో నటించాం, రెమ్యునరేషన్ తీసుకున్నాం.. అక్కడితో పనైపోయిందనుకునే హీరోయిన్ల కారణంగా ఆయా చిత్రాల నిర్మాతలకు అప్పుడప్పుడూ హీరోయిన్లపై అసహనం పెరిగిపోవడం మామూలే. దర్శకులకూ హీరోయిన్లు కొరకరాని కొయ్యిలుగా తయారవుతుంటారు. ఇలియానాపైన కూడా ఓ దర్శకుడు అప్పట్లో గుస్సా అయ్యాడు. ఆ కారణంగానే ఆమె కొన్నాళ్ళపాటు టాలీవుడ్‌కి దూరమయ్యింది.
ఆ విషయాల్ని పక్కన పెడితే, సొంత డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా ఇన్నాళ్ళకు తెలుగు సినిమాపై ఇలియానా కొంత గౌరవం పెంచుకుందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.