ఆర్థిక భారంతో సినిమాలు ఆగిపోవడం మామూలే. కానీ 'స్టార్' స్టేటస్ ఉన్న ఓ హీరో సినిమా ఇలా డబ్బుల్లేక ఆగిపోవడం మాత్రం అరుదుగా జరిగే విషయం. అలా.. రానా దగ్గుబాటి సినిమా ఒకటి ఆగిపోయింది. రానా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం '1945'. సత్య దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా కథానాయికగా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయాలన్నది నిర్మాతల ప్రయత్నం.
అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనుల్నీ పక్కన పెట్టేశారు. దానికి గల కారణం... చేతిలో డబ్బులు లేకపోవడమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారట. సినిమా పూర్తవ్వడానికి మరో పది కోట్లయినా అవసరం అవుతోందట. ఆ డబ్బు లేకపోవడంతో షూటింగ్‌ని నిలిపేశారని తెలుస్తోంది. చేతికి డబ్బులు అందిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఈ యేడాది చివర్లో విడుదల చేయడం ఖాయమని సమాచారం. అప్పటి వరకూ.... రానా సినిమాకి కష్టాలు తప్పవు.