జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుస పరాజయాలు టాలీవుడ్‌ని కుదిపేశాయి. 'ఎఫ్ 2' తప్ప ఒక్కటంటే ఒక్క విజయమూ దక్కలేదు. బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ వేసవిలో పెద్ద సినిమాలు వరుస కడుతున్నాయి. వాటితో అయినా చిత్రసీమ ఊపిరి పీల్చుకుంటుందేమో అన్నది సినీ జనాల ఆశ. మార్చి 1న రెండు సినిమాలు విడుదలయ్యాయి. కళ్యాణ్ రామ్ నటించిన '118'తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'విశ్వాసం' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వం వహించిన చిత్రం '118'. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. కళ్యాణ్ రామ్ ఇలాంటి జోనర్‌లో సినిమా ఎప్పుడూ చేయలేదు. దాంతో.. ఈ కథ అతనికి కొత్తగా అనిపించింది. తొలి రెండు రోజుల వసూళ్లు ఓకే అనిపించాయి. రెండు రోజులకు కలిపి రూ.3.5 కోట్ల వరకూ వచ్చాయి. సోమవారం మహాశివరాత్రి సెలవు వచ్చింది. దీన్ని కళ్యాణ్ రామ్ సినిమా ఎంత వరకూ క్యాష్ చేసుకుంటుందో చూడాలి. టాక్ కాస్త అటూ ఇటూ ఉన్నా.. ఈ సినిమా కమర్షియల్‌గా గట్టెక్కేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ రూపంలో 8 కోట్ల వరకూ రావడంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నాడు.
ఇక అజిత్ నటించిన డబ్బింగ్ సినిమా 'విశ్వాసం' కూడా ఈ వారమే విడుదలైంది. సాధారణంగా అజిత్ సినిమాలకు తెలుగులో అంతగా మార్కెట్ ఉండదు. ఈ సినిమాకి పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. కామ్‌గా వచ్చేసింది. బీ.సీలలో మరీ ముఖ్యంగా యాక్షన్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లెక్కువగా ఉన్నచోట... వసూళ్లు కాస్త ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. తొలి రెండు రోజుల్లో కోటి రూపాయల షేర్ తెచ్చుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈమధ్య విడుదలైన డబ్బింగ్ సినిమాలో పోలిస్తే... ఇది కాస్త మెరుగైన ఫలితమే అని చెప్పాలి.