టాలీవుడ్‌లో మరో డ్రై ఫ్రైడే వచ్చింది. నాలుగైదు సినిమాలు విడుదలైనా - ఒక్కటంటే ఒక్కటీ... ప్రేక్షకుల మన్ననలు పొందిన పాపాన పోలేదు. ఈ వారం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ', 'జెస్సీ', 'మౌనమే ఇష్టంగా', 'బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్' చిత్రాలు విడుదలయ్యాయి. అన్నీ చిన్న సినిమాలే. కొన్ని విపరీతమైన ప్రచారంతో హోరెత్తించాయి. కానీ విషయం మాత్రం శూన్యం.
లక్ష్మీ రాయ్ గ్లామరే ప్రధాన అస్త్రంగా రూపొందిన చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ'. హారర్, హ్యూమర్, గ్లామర్ మిక్సయిన ఈ సినిమా... ఏ విభాగానికీ న్యాయం చేయలేక బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. లక్ష్మీ రాయ్ గ్లామర్ కూడా టికెట్లు తెంపలేకపోయింది. రొటీన్ కథ, నీరసమైన కథనం, కితకితలు పెట్టుకున్నా నవ్వురాని కామెడీ, హారర్ గురించి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. అన్ని రంగాలూ ఏక తాటిపై విఫలమైన చిత్రమిది. దానికి తగ్గట్టుగానే రివ్యూలు, రెవిన్యూలు వచ్చాయి. దాదాపు 5 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. కోటి రూపాయలు రావడమే గగనం అని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి.
ఈవారం విడుదలైన మరో మూడు చిత్రాల పరిస్థితి కూడా ఇంతే. 'జెస్సీ' అనేది ఓ హారర్ సినిమా. పాయింటు కొత్తగానే ఉన్నా - దర్శకుడు దాన్ని నడపడంలో, రెండు గంటల సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. ప్రచార లోపాల వల్ల ఈ సినిమా వచ్చిందన్న సంగతే ప్రేక్షకుడికి తెలియకుండా పోయింది. 'మౌనమే ఇష్టంగా', 'బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్' చిత్రాల గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా కొత్త వాళ్లతో తయారైన ఈ సినిమాలు రెండూ... ప్రేక్షకుల ఆదరణకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో తల్లడిల్లుతున్న టాలీవుడ్‌కి ఈ శుక్రవారం కూడా ఉపశమనం దక్కలేదు.