తారాగణం: లక్ష్మీ రాయ్, పూజిత పొన్నాడ, మధునందన్, ప్రవీణ్, రామ్ కార్తీక్ & తదితరులు
నిర్మాణ సంస్థ: ఏబీటి క్రియేషన్స్ బ్యానర్
సంగీతం: హరి గౌర
ఎడిటర్: యస్. ఆర్. శేఖర్
నిర్మాతలు: యమ్. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి మరియు ఆర్.కె రెడ్డి
రచన: తటవర్తి. కిరణ్
దర్శకత్వం: కిషోర్ కుమార్
విడుదల: 15 మార్చి 2019
రేటింగ్: 1.5/ 5
కాస్త భయం... మరి కాస్త ఉత్కంఠ. వీటి మధ్యలోనే కామెడీ పండుతుంటుంది. వీటినే హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలంటారు. తెలుగులో పది చిన్న సినిమాలు విడుదలైతే, వాటిలో మూడో వంతు హారర్ కామెడీ కథలే. తక్కువ వ్యయంతో నిర్మించే వెసులుబాటు, ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్న చిత్రాలు ఇవే. అందుకే తెలుగులో తరచుగా తెరకెక్కుతుంటాయి. అందులో భాగంగా వచ్చిన మరో చిత్రమే 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. లక్ష్మీరాయ్ ఇందులో వెంకటలక్ష్మి కావడంతో... విడుదలకి ముందే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
* కథ
వెంకటలక్ష్మి (లక్ష్మీరాయ్) టీచర్‌గా ఊళ్లోకి అడుగు పెడుతుంది. ఆమె అందచందాల్ని చూడగానే చంటి (ప్రవీణ్), పండు (మధునందన్) మనసు పారేసుకుంటారు. పనీ పాట లేకుండా తుంటరి పనులు చేస్తూ తిరిగే చంటి, పండు కలిసి వెంకటలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఆమె కూడా వీళ్లని ఓ పని కోసం వాడుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే వెంకటలక్ష్మి దెయ్యం అని తెలుస్తుంది. నిజంగా ఆమె దెయ్యమేనా? ఆమె చెప్పిన పనిని చంటి, పండు చేశారా? ఆ పనికీ... శేఖర్ (రామ్‌కార్తీక్), గౌరీ (పూజిత పొన్నాడ)ల ప్రేమకీ సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటుల పనితీరు
లక్ష్మీరాయ్ చేసిన వెంకటలక్ష్మి పాత్ర సినిమాకి కీలకం. కానీ దాన్ని డిజైన్ చేసిన విధానంలోనే బలం లేదు. ఒక్క చోట మాత్రమే భయపెట్టే సన్నివేశాల్లో కనిపించింది. మిగిలిన చోట్లంతా అందంగా కనిపించిందంతే. ప్రవీణ్, మదునందన్‌లు సినిమా మొత్తం కనిపించారు. వాళ్లు పాత్రల పరిధి మేరకు నవ్వించడానికి చాలా ప్రయత్నించారు కానీ... అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ అప్పుడప్పుడు అతిథి పాత్రల్లా కనిపించారంతే. ఒక పాటలో మాత్రం ముద్దు సన్నివేశాలతో వేడెక్కించారు. వీరారెడ్డిగా పంకజ్ కేసరి అక్కడక్కడా మెప్పించాడు.
* విశ్లేషణ
ఒక దెయ్యం ఉంటుంది, అది తన పగ తీర్చుకోవడానికి మరొకరిని పావుగా వాడుకొని లక్ష్యం నెరవేర్చుకుంటుంది. హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలంటే ఎక్కువగా ఇలాంటి కథలతోనే తెరకెక్కుతుంటాయి. ఇది కూడా ఆ తాను ముక్కే. కాకపోతే వెంకటలక్ష్మి దెయ్యమా కాదా అనేదే ఇక్కడ సస్పెన్సు. సాధారణంగా దెయ్యం ప్రవర్తనతో హాస్యం, హారర్ అంశాలు పండుతుంటాయి. అది ఎందుకు పగబట్టిందనే విషయాన్ని రివీల్ చేయడంలో భావోద్వేగాలు పండుతుంటాయి.
కానీ ఇక్కడ మాత్రం అవేవీ పండలేదు. అల్లరి కుర్రాళ్లు ఓ మంచి పని చేయడమే ఈ సినిమా. అల్లరి కుర్రాళ్లకి తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకోవడం... వాటిలో బలం లేకపోవడంతో సినిమా అంతా కంగాళీగా మారింది. అడుగడుగునా అనవసరమైన పాత్రలు, పస లేని కామెడీ సన్నివేశాలే. వాటితో ఏమాత్రం వినోదం పండకపోగా సినిమా ఒక సాగదీత ప్రహసనమైంది. చంటి, పండు, వెంకటలక్ష్మి, వీరారెడ్డిల కథ ఇది.
కమర్షియల్ అంశాల్ని ఆశించి నాయకానాయికల పాత్రల్ని జోడించారేమో కానీ.. ఈ సినిమాకి ఆ పాత్రల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనిపిస్తుంది. పండు, చంటి పాత్రలు చేసే తుంటరి పనులు కూడా వెగటు పుట్టిస్తాయి తప్ప, వినోదం పండించవు. విలన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రథమార్థంలో పర్వాలేదనిపించినా.. ద్వితీయార్థంలో మాత్రం సిల్లీగా అనిపిస్తాయి. ఒక్క సన్నివేశం కూడా లాజిక్‌తో సాగుతున్నట్టు అనిపించదు. పతాక సన్నివేశాల్లో కూడా బలం లేదు.
* సాంకేతిక వర్గం...
సాంకేతికంగా సినిమా బాగుంది. వెంకట్ కెమెరా పనితనం, హరి గౌర సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. కిరణ్ మాటల్లో డబుల్ మీనింగ్‌లు ఎక్కువే. దర్శకుడు కిషోర్ కుమార్ కామెడీ థ్రిల్లర్‌కి ఉండాల్సిన లక్షణాల్ని పసిగట్టలేకపోయాడు. అందుకే సినిమా అంతా సాదాసీదాగా సాగుతుంది. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అని క్వశ్చన్ మార్క్‌తో టైటిల్ పెట్టుకున్నాకైనా... ఈ సినిమాలో వేర్ ఈజ్ కామెడీ, వేర్ ఈజ్ హారర్ అని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందేమో. చివరి వరకు కూడా వేర్ ఈజ్ అసలు విషయం అంటూ సాగదీతగా సాగే సన్నివేశాల్ని భరించాల్సి వస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+ లక్ష్మీరాయ్ గ్లామర్
* మైనస్ పాయింట్స్
- వినోదం లేకపోవడం
- లాజిక్ లేని సీన్లు
- నత్తనడక కథనం
* ఫైనల్ వర్డిక్ట్: వేర్ ఈజ్ ద వినోదం.
- రివ్యూ రాసింది శ్రీ.