నేను శైలజతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. మహానటితో పెద్ద స్టార్ అయిపోయింది. ఆసినిమాతో.. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. అప్పటి నుంచీ లేడీ ఓరియెంటెడ్ కథలు ఆమె వెంట పడ్డాయి. అయితే.. మంచి కథల్ని ఎంచుకోవడంలో మహా నటి పొరపాట్లు చేస్తోందనిపిస్తోంది. మొన్న పెంగ్విన్, ఇప్పుడు... `మిస్ ఇండియా` రెండూ కీర్తి అంచనాల్ని తలకిందులు చేసిన సినిమాలే.
అసలు ఈ కథల్ని కీర్తి ఎలా ఒప్పుకుంది? అనే సందేహాలు కలుగుతున్నాయందరికీ. ఫ్లాపులు రావడం తప్పు కాదు. కానీ.. కథలోనే దోషాలున్నప్పుడు అలాంటి కథల్ని ఎలా ఎంచుకుంటోందో? అనే అనుమానాలు వస్తున్నాయి. కేవలం.... మహానటితో తనకొచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమాల్ని ఒప్పుకుంటుందా? అనిపిస్తోంది. ఏదేమైనా రెండు ఫ్లాపులు కీర్తి కెరీర్‌ని ప్రభావితం చేసేలానే కనిపిస్తున్నాయి. త్వరలోనే `గుడ్ లక్ సఖీ` రాబోతోంది. అదీ లేడీ ఓరియెంటెడ్ కథే. కీర్తి.. ఇలాంటి కథల్ని ఎంచుకోవాలో, లేదంటే... వాటికి పుల్ స్టాప్ పెట్టాలో ఆ సినిమాతో నిర్ణయమైపోతుంది.
అయితే.. ఈలోగా కీర్తితో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేద్దాం అనుకున్న నిర్మాతలు మాత్రం మరో ఆప్షన్ని వెదుక్కోవడం ఖాయంలా కనిపిస్తోంది. హీరోయిన్గా ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తప్పవు.కానీ.. సోలో హీరోయిన్గా, అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం ఫ్లాప్ తగిలితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అటు కమర్షియల్ సినిమాలు సైతం చేజారిపోయే పరిస్థితులు ఎదురవ్వొచ్చు. కీర్తి సురేష్‌కీ ఈ ప్రమాదం పొంచి ఉందేమో అనిపిస్తోంది.