'ఇంత చిన్న వయసులో నిర్మాతగా ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాడో.. అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది.. అతనిపై గౌరవం పెరుగుతోంది..' అంటూ మెగా పవర్ స్టార్, మెగా ప్రొడ్యూసర్ రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించేశాడు జగ్గూబాయ్ అలియాస్ జగపతిబాబు.
'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ఓ కీలకమైన రోల్‌లో కన్పించనున్న జగపతిబాబు, జార్జియాలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఓ రోజు సెట్‌లోకి వచ్చిన చరణ్, షూటింగ్ స్పాట్‌లో ప్రతి ఒక్కర్నీ పలకరించి, వారి బాగోగుల్ని తెలుసుకోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. యూనిట్ మెంబర్స్ ఆరోగ్యం గురించీ, వారు తీసుకునే ఆహారం గురించీ నిర్మాత జాగ్రత్తలు తీసుకోవడం ఈ రోజుల్లో అరుదైన విషయంగా మారిపోయిందనీ, ఈ విషయంలో చరణ్ 'ది బెస్ట్' అనీ జగపతిబాబు కితాబులిచ్చేశారు.
నిర్మాతగా చరణ్ ఇప్పటికే ఓ మెగా విక్టరీ సొంతం చేసేసుకున్నాడు. తొలి ప్రయత్నంతోనే 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో ఆ విజయాన్ని అందుకున్నాడు చరణ్. రెండో సినిమా కూడా తన తండ్రి చిరంజీవితోనే 'సైరా నరసింహారెడ్డి'ని రూపొందిస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్. ఓ వైపు హీరోగా తన సినిమాలు తాను చేసుకుంటూనే, ఇంకో వైపు సినిమా నిర్మాణాన్ని చేపట్టడమంటే చిన్న విషయం కాదు. అది కూడా, సెట్స్‌లో అందర్నీ సంతృప్తి పరిచేలా నిర్మాత అందరి బాగోగుల్నీ చూసుకోవడం అంటే 'గ్రేట్'.