టాలీవుడ్ లో ఇప్పుడు చర్చంతా ప్రస్తుతం రాజశేఖర్ కారు ప్రమాదంపైనే. ఈ తెల్లవారుఝామున రాజశేఖర్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురవ్వడం, రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడడం తెలిసిన విషయమే. ఈ ప్రమాదం గురించి చిలవలు పలవలుగా వార్తలు రాకమునుపే.. వీటిపై ఓ క్లారిటీ ఇవ్వాలని జీవిత భావించారు. అందుకే ఓ వీడియో బైట్ విడుదల చేశారు. కారు టైరు పంక్చర్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, చిన్న గాయం మినహా రాజశేఖర్ బాగానే ఉన్నారని, ఇంట్లోనే ప్రాధమిక చికిత్స తీసుకున్నారని జీవిత క్లారిటీ ఇచ్చారు.
పోలీసులతో టచ్‌లోనే ఉన్నానని, రాజశేఖర్ కోలుకున్న తరవాత మరోసారి పోలీసులను కలుసుకుని, విచారణకు సహకరిస్తామన్నారు జీవిత. అయితే రాజశేఖర్ కారు ప్రమాదానికి గురవ్వడం ఇదేం కొత్త కాదు. రెండేళ్ల క్రితం రాజేంద్రనగర్‌లో రాజశేఖర్ కారు, మరో కారుని ఢీ కొట్టింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల రాజశేఖర్ కారుపై కూడా మూడు చలానాలు నమోదయ్యాయి. అతి వేగంతో ప్రమాదకరంగా కారు నడుపుతున్నందుకు ఈ చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు.