ఈరోజుల్లో సోలో రీలీజులే సో బెటరు అనుకుంటున్నారు నిర్మాతలు. థియేటర్లకు వచ్చి, సినిమాలు చూసే జనం తగ్గిపోతున్నారు. ఉన్న జనాన్ని పంచుకోవడం, వసూళ్లలో వాటాలు ఇచ్చుకోవడం ఎందుకన్నది ప్రధాన ఆలోచన. రెండు పెద్ద సినిమాలు అందుకే పోటీ పడడం లేదు.కనీసం రెండు మినిమం గ్యారెంటీ సినిమాలూ - ధైర్యం చేయడం లేదు. కాకపోతే ఈ డిసెంబరు 20న మాత్రం రెండు సినిమాలు ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాయి. ఒకటి... 'ప్రతి రోజూ పండగే', రెండోది 'రూలర్'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'రూలర్'ని డిసెంబరు 20న విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
బాలయ్య సినిమా అంటే మాస్ లో హడావుడి మామూలుగా ఉండదు. పైగా 'రూలర్' పూర్తిగా మాస్ సినిమానే. బాలయ్య ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ పొందుపరచి తయారు చేసిన సినిమా ఇది. బీ,సీలలో క్లిక్ అయితే.. ఇక బాలయ్యని ఆపలేరు. అదే రోజున సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' కూడా వస్తోంది. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. 'రూలర్' మాస్ అయితే... ఇది 'క్లాస్' అన్నమాట. అంటే ఒకే రోజున ఓ క్లాస్ సినిమా, మరో మాస్ సినిమా విడుదల కాబోతున్నాయి. బాలయ్య సినిమాని ఢీ కొట్టాలంటే చాలా ధైర్యమే ఉండాలి. మరి తేజూ అంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడో..??