రాజశేఖర్ నటించిన సినిమా `శేఖర్`. రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రానికి జీవిత రాజశేఖర్ దర్శకురాలు. మలయాళంలో విజయవంతమైన `జోసెఫ్` చిత్రానికి ఇది రీమేక్. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. దాంతో ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు బాగానే వచ్చాయి. ఓ దశలో ఈ సినిమాని రూ.18 కోట్లకు కొనడానికి ఓటీటీ సంస్థ ఉత్సాహం చూపించిందని చెప్పుకొన్నారు. కానీ జీవిత అమ్మలేదు. ఈసినిమాని థియేటర్లలోనే చూపిస్తానని పట్టుపట్టి కూర్చున్నారు. జీవిత నో అనేసరికి ఓటీటీ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చేస్తోంది.
ఓటీటీ ఆఫర్ ఒప్పుకొంటే, ఇప్పటికి ఈ సినిమా లాభాల్లో ఉండేది. ఇంతే డబ్బు చూడాలంటే మాత్రం శేఖర్ హిట్టయి.. కనీసం 25 కోట్లు తెచ్చుకోవాలి. అది సాధ్యమా? అనే అనుమనాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. సినిమాలు చూసే మూడ్, ఇంట్రస్ట్ ఇప్పుడు ఎవరికీ పెద్దగా లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప, జనాలు థియేటర్లకు రావడం లేదు. `ఆచార్య` పరిస్థితే చూడండి. ఫ్లాప్ టాక్ రావడంతో మెగాస్టార్ సినిమానే పట్టించుకోలేదు. అలాంటిది రాజశేఖర్ సినిమా చూస్తారా? అనూహ్యమైన హిట్ టాక్ వచ్చి, బాక్సాఫీసు దగ్గర జనాలు హోరెత్తితే తప్ప.. ఈ సినిమాకి పాతిక కోట్లు రావు. మరి జీవిత తీసుకొన్న నిర్ణయం సరైనదా, కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.