విశ్వ విఖ్యాత నట సార్వభౌమునిగా అభివర్ణించబడే స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ రోజు. ఇంత గొప్ప పర్వ దినాన ఆ మహానుభావునికి తీరని అన్యాయం జరిగింది. ఎన్టీఆర్ ఘాట్‌ని అలంకరించకుండా వదిలేయడం ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా కలిచి వేసింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బరిలోకి దిగి, అప్పటికప్పుడు పూలు తెప్పించి, స్వయంగా తన చేతులతో తాత ఎన్టీఆర్ సమాధిని అందంగా అలంకరించడం జరిగింది.
ప్రతీ ఏడాది ఈ దినాన ఎన్టీఆర్ ఘాట్‌ని అందంగా అలంకరించే జీహెచ్‌ఎంసీ వారు ఈ ఏడాది ఇలా వదిలేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు ఘాట్‌ని శుభ్రం చేసి, పూలతో అలంకరించి, తాత స్వర్గీయ ఎన్టీఆర్‌కి జూనియర్ ఎన్టీఆర్ ఘనమైన నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలవడం, టీడీపీ శ్రేణుల్ని తీవ్రంగా కుంగదీసింది.
మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలంటే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టాల్సి ఉంటుందనీ, లేదంటే టీడీపీ తన ఉనికిని కోల్పోయే అవకాశముందనీ, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రచారానికి కూడా రాని ఎన్టీఆర్ మరి టీడీపీ పగ్గాలు చేపట్టడమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎన్టీఆర్ ఆ ఆలోచన చేస్తాడా.? వేచి చూడాలిక.