యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారని, 'రాధే శ్యామ్' అనే టైటిల్ లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇంతవరకూ సంగీత దర్శకుడిని ఫైనలైజ్ చెయ్యలేదు. తాజాగా నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసినట్టు సమాచారం అందుతోంది.
తమిళ మ్యూజిక్ కంపోజర్ జస్టిన్ ప్రభాకరన్ కు ఈ అవకాశం లభించిందని అంటున్నారు. జస్టిన్ తమిళంలో ఓ డజను చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాకు సంగీతం అందించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు కానీ జస్టిన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కు మంచి ఆదరణ దక్కింది. అందరి అంచనాలకు భిన్నంగా ఓ యువ సంగీత దర్శకుడికి ఇలా అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే.
సినిమాను మొదలు పెట్టి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటివరకూ మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చెయ్యకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇప్పుడు జస్టిన్ ను ఎంచుకున్నారు కాబట్టి ప్రోమోస్ రిలీజ్ చేయడానికి అడ్డంకి తొలగిపోయినట్టే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.