జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చాడు బాబి. ఇప్పుడు ఏకంగా మెగా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ఈ యువ దర్శకుడికి అందినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఆ చర్చలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మైత్రీ మూవీస్ లో చిరంజీవి సినిమా చేయడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు పవన్ - హరీష్ శంకర్ సినిమా మైత్రీనే చేస్తోంది. నిజానికి పవన్ కోసం బాబి ఓ కథ సిద్ధం చేశారు. పవన్ - బాబి కాంబోని పట్టాలెక్కించాలని మైత్రీ మూవీస్ కూడా గట్టిగానే అనుకుంది. కానీ... అది హరీష్ శంకర్ చేతికి వెళ్లింది. పవన్‌తో మిస్సయినా.. చిరుతో సినిమా చేసే చేసుకునే ఛాన్సు దక్కించుకున్నాడు బాబి. 2021లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.