హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్‌తో రూపొందిన తెలుగు 'అర్జున్‌రెడ్డి' అనేక విమర్శల నడుమ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది. కోట్ల దారి కోట్లదే. పోట్ల దారి పోట్లదే.. అన్నట్లుగా అవకాశం చిక్కిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని ఓ పోటు పొడుస్తూనే ఉన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని నీతి వాక్యాలు కూడా వల్లించేస్తున్నారు కొందరైతే. అంతేలెండి అవకాశం వస్తే, ప్రతీ వోడూ సిద్ధాంతే కదా మరి. అలా అయిపోయింది ప్రస్తుతం 'కబీర్ సింగ్' పరిస్థితి. ప్రతీ ఒక్కరి నోటిలోనూ నానుతూనే ఉంది.
సినిమానే కాదు, ఆ పాత్ర పోషించినందుకు హీరో షాహిద్ కపూర్‌ని కూడా ఆడి పోసుకుంటున్నారు. హీరోలు ఆదర్శంగా ఉండాలి.. లేదంటే వారి అభిమానులు కూడా అలాగే తయారవుతారు.. అంటూ విమర్శిస్తున్నారు. అంతేనా.. షాహిద్ ఈ పాత్ర ఒప్పుకునేముందు ఒక్కసారి తన తల్లికి చెప్పి ఉండాల్సింది. ఆమెకు తెలిస్తే ఈ పాత్ర పోషించేందుకు అస్సలు ఒప్పుకోదు అని కూడా చెప్పేస్తున్నారు. ఇంత జరిగాక అదే ఆయన తల్లిని కూడా ఇందులోకి లాగాక ఆమె కూడా బయటికి రావాలి కదా. వచ్చింది. తనదైన శైలిలో స్పందించింది.
ఓ కళాకారుడు అన్నాక ప్రతీ పాత్రనూ పోషించగలగాలి. ఏ పాత్ర పోషించాలి.. అని ప్రతీసారి తల్లిని అడిగి పర్మిషన్ తీసుకోవడం తగదు. ఒకవేళ నా కొడుకు నన్ను అడిగినా, నేను అందుకు అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో.. నా కొడుకు కబీర్ సింగ్ పాత్ర పోషించాడని, సినిమా చూసినవాళ్లందరూ కబీర్‌సింగ్‌లు అయిపోతే, సైకో కిల్లర్ సినిమాలు చాలా వస్తున్నాయి. వాటిని చూసి, సమాజంలో అందరూ సైకో కిల్లర్స్ అయిపోవడం లేదు కదా.. అని ఆమె చక్కగా వివరణ ఇచ్చారు. అమ్మ మాటతో 'కబీర్ సింగ్'పై విమర్శలకు చెల్లు చీటీ పడుతుందేమో చూడాలిక.