ఆమధ్య గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొన్న కాజల్ ఈ యేడాది ఏప్రిల్‌లో పండంటి బిడ్డకు తల్లైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తోంది. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది.
`ఆచార్య`లో కాజల్ నటించినా, ఆమె సీన్లన్నీ ఆ తరవాత ఎడిటింగ్ లో కత్తిరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో... తొలగింపు మంచికే అనే ఫీలింగ్ లోకి వచ్చేసింది కాజల్. అయితే.. `భారతీయుడు 2`లోనూ కాజల్ పాత్ర లేపేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 సెట్స్‌పైకి వెళ్లి, కొన్ని రోజులు షూటింగ్ చేసుకొని ఆగిపోయిన సంగతి తెలిసిందే. అందులో కాజల్ హీరోయిన్. త్వరలోనే ఈ సినిమాని మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లి, ఏదోలా పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు కమల్. అందులో భాగంగా, కాజల్ పాత్రని లేపేసి, ఆ పాత్రలో మరో కథానాయికని తీసుకోవాలని కమల్ భావించినట్టు వార్తలొచ్చాయి. అయితే.. ఇవి కాజల్ వరకూ వెళ్లాయని, ఈ విషయమై కమల్ తో.. కాజల్ ఫోన్ లో మాట్లాడినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
కమల్ కూడా కాజల్ ని భరోసా ఇచ్చాడని, భారతీయుడు 2 సెట్స్‌పైకి వెళ్తే.. అందులో నీ పాత్ర తప్పకుండా ఉంటుందని మాట ఇచ్చాడని సమాచారం. దాంతో కాజల్ ఊపిరి పీల్చుకొందట. ఇప్పుడు కాజల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఎలాగైనా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని, అందులో తన పాత్రకు మంచి పేరు రావాలని కోరుకుంటోందట కాజల్. మరి కాజల్ కోసమైనా.. భారతీయుడు సెట్స్‌పైకి వెళ్తుందేమో చూడాలి.