'వినయ విధేయ రామ' ట్రైలర్ వచ్చింది. మాస్, ఊర మాస్, వీర మాస్ అనే తరహాలో టీజర్ రూపొందింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నుంచి వచ్చే సినిమాల్లో కంటెంట్ ఇలాగే వుంటుంది. చరణ్‌కి ఈ తరహా సినిమాలు కొత్తేమీ కాదు. అయితే అంతకు మించి అనే స్థాయిలో మాస్ యాంగిల్ చరణ్‌లో కన్పించింది. 'రంగస్థలం' సినిమాలో కొత్త చరణ్‌ని చూశాం. నటుడిగా అంతకు మించిన పరిణతిని చరణ్ 'వినయ విధేయ రామ'లో ప్రదర్శించాడని అనుకోవాలి. అది కూడా మాస్ యాంగిల్‌లోనే.
టైటిల్‌లో వున్న 'వినయ విధేయతలు' ఈ ట్రైలర్‌లో ఎక్కడా కన్పించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. బహుశా ఆ వినయ విధేయతలు సినిమాలో వుంటాయేమో, ట్రైలర్‌లో మాత్రం విధ్వంస రాముడే కన్పించాడని కేటీఆర్ అన్నారు. టీజర్‌లో చూపించిన విధ్వంసాన్ని డబుల్ చేసి ట్రైలర్‌లో చూపించారు. హీరోయిన్‌కి స్కోప్ చాలా తక్కువ కన్పించింది. డాన్సింగ్ మూమెంట్స్‌కీ అవకాశమివ్వలేదు ట్రైలర్‌లో.
అయితే 'ఏక్ బార్' సాంగ్‌కి సంబంధించిన ప్రోమో మాత్రం విడిగా విడుదల చేశారు. అందులో చరణ్ స్టెప్స్ అదిరిపోయాయి. లుక్ వైజ్‌గా ఆ పార్టీ చాలా క్లాస్‌గా జరిగినట్లు అన్పిస్తోంది. పార్టీ సాంగ్ అది. 'పాటలు అదరగొట్టేశావ్ దేవీ.. డాన్స్ మాస్టర్లు నా మోకాళ్ళు విరక్కొట్టేశారు..' అంటూ చరణ్ చేసిన వ్యాఖ్యలతో, సినిమాలో చరణ్ డాన్సులపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. తనకు ఇటీవలి కాలంలో పెర్‌ఫెక్ట్ డాన్స్ పార్టనర్ దొరికినట్లు చరణ్, హీరోయిన్ కైరా అద్వానీ గురించి చెప్పడం కొసమెరుపు.