ఓ హిట్లు.. నాలుగు ఫ్లాపులూ అన్నట్టు సాగుతోంది కల్యాణ్ రామ్ కెరీర్. 118 తరవాత `ఎంత మంచి వాడవురా` ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఓ హిట్టు కొట్టి రేసు లోకి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకే తన దృష్టంతా `బింబిసార` పై కేటాయించాడు. ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కింది. మధ్యలో ఒకట్రెండు అప్‌డేట్స్ తప్ప ఈ సినిమా గురించిన విశేషాలేం తెలీవు. ఈ సినిమా పూర్తయ్యిందా, లేదా? ప్రస్తుతానికి ఏ స్టేజీలో ఉంది? అనే వివరాలు చెప్పడం లేదు. ఈ పాండమిక్ లో.. చాలా సినిమాలు ఆగిపోయాయి. అలానే `బింబిసార`కూ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఇలాంటి తరుణంలో.. `బింబిసార`కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉందట. అయితే.. ఇప్పటి వరకూ జరిగిన రషెష్ మొత్తం చూసుకుని, కొన్ని చోట్ల రీషూట్ చేయాలని, కథలో చిన్న చిన్న మార్పులు అవసరమని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాని బాబాయ్ బాలకృష్ణకు చూపించి, ఆయన సలహాలూ, సూచనలు కూడా తీసుకున్నాడట కల్యాణ్‌రామ్. ఈ సినిమాని గప్ చుప్ గా పూర్తి చేసి, ఓ టీజర్ వదిలి షాక్ కి గురి చేయాలని భావిస్తున్నాడు కల్యాణ్ రామ్. మల్లిడి వేణు ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ నే నిర్మాత.