సినిమా తీయడం ఒక ఎత్తు. తీసిన సినిమాని సరైన సమయంలో విడుదల చేయడం మరో ఎత్తు. బ్యాడ్ టైమ్‌లో రిలీజ్ చేస్తే మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుంటాయి. మంచి టైమ్‌లో రిలీజ్ చేస్తే యావరేజ్ సినిమాలు కూడా ఆడేస్తుంటాయి. సోలో రిలీజ్ అన్నది చాలా కీలకం. పోటీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ కల్యాణ్ రామ్ మాత్రం - పోటీ గురించి ఆలోచించడం లేదు. రెండు పెద్ద కొండల్ని ఢీ కొట్టడానికి రెడీ అయిపోయాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'ఎంత మంచి వాడవురా'.
సతీష్ వేగేశ్న దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్సయ్యింది. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామాలు బాగా వర్కవుట్ అవుతాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్స్ అయ్యాయి. ఓ విధంగా చూస్తే కల్యాణ్ రామ్ ప్లాన్ బాగానే ఉంది. మరో విధంగా చూస్తే... అక్కడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర భయంకరమైన పోటీ నెలకొని వుంది.
మహేష్ (సరిలేరు నీకెవ్వరు), బన్నీ (అల వైకుంఠపురములో) సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. రజనీకాంత్ దర్బార్ కూడా పండక్కే వస్తోంది. వీటి మధ్య కల్యాణ్ రామ్ సినిమా విడుదల చేయడం రిస్కే. కాకపోతే.. సినిమా బాగుంటే ఎంత పోటీ అయినా తట్టుకోవచ్చు. పైగా సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగానే ఉంటారు. కల్యాణ్ రామ్ ధీమా కూడా అదే కావొచ్చు.