హీరోగా పలు విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న కమల్ హాసన్ సినిమాలకు టాటా చెప్పి, తాజాగా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కమల్ హాసన్ జనంతో మమేకమయ్యేందుకు రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు కమల్ హాసన్ మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్ధుల్ కలాం స్వస్థలం అయిన రామేశ్వరం చేరుకున్నారు. కలాం సోదరుడితో భేటీ అయ్యారు. కలాం వంటి గొప్ప వ్యక్తి స్వస్థలం నుండి తన రాజకీయ యాత్ర ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందనీ కమల్ చెప్పారు. ఆ తర్వాత మత్స్యకారులతో కమల్ హాసన్ భేటీ అయ్యి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
తదనంతరం హయత్ ప్యాలెస్‌లో నిర్వహించనున్న ప్రెస్ మీట్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ మధురై చేరుకుంటారు. అక్కడే తన కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మదురైలో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ అజెండా ఏంటి? అనే విషయాలను ఈ కార్యక్రమంలో కమల్ తెలపనున్నారు.
ఆ తర్వాత కమల్ హాసన్ తన స్వస్థలమైన పరమకుడి, రామంతపురం, శివగంగ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మరోవైపు రాజకీయ పార్టీ ప్రకటించనున్న సందర్భంగా కమల్‌హాసన్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, కమల్‌హాసన్‌కి విషెస్ అందించారు.