బిగ్ బాస్ హోస్ట్ గా మరోసారి అవతారం ఎత్తబోతున్నాడు నాగార్జున. ఎన్టీఆర్, నాని ఒకొక్క ఎపిసోడ్‌తో బిగ్ బాస్ ని అలరించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అన్ని సీజన్లనూ నాగార్జునే హోస్ట్ గా నడిపించేశాడు. కొత్త సీజన్ త్వరలోనే కాబోతోంది. దీనికి కూడా కర్త, కర్మ, క్రియ నాగ్‌నే. ఎన్టీఆర్, నాని ఒకొక్క ఎపిసోడ్లతోనే సర్దుకుపోతే నాగ్ నాన్ స్టాప్ గా.. కొనసాగుతున్నాడు. దానికి కారణం ఒక్కటే. బిగ్ బాస్ ద్వారా నాగార్జున భారీ పారితోషికం అందుకుంటున్నాడు. నాగ్ ఇన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ తన పారితోషికం రూ.5 కోట్లు దాటలేదు. అలాంటిది బిగ్ బాస్ కొత్త సీజన్‌కి ఏకంగా రూ.9 కోట్లు అందుకుంటున్నాడట.
ఇది వరకూ కూడా తన పారితోషికం కంటే రెట్టింపు మొత్తంలో బిగ్ బాస్ నుంచి తీసుకొన్నాడు నాగ్. బయట ఓ సినిమా చేయాలంటే కనీసం రెండు నెలలు కష్టపడాలి. ఆ ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ బిగ్ బాస్ అలా కాదు. వంద రోజుల పాటు సాగే షో ఇది. వారానికి రెండు సార్లు కనిపిస్తే చాలు.
ఆ రెండు ఎపిసోడ్లనీ ఒకే రోజు షూట్ చేస్తారు. కాబట్టి... పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పైగా బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వేస్తున్నారు. ఈ సెట్ ద్వారా కూడా అన్నపూర్ణకి భారీ ఆదాయం వస్తోంది. ఒకవేళ ఈ షో నుంచి నాగ్ తప్పుకొంటే.. సెట్ ద్వారా వచ్చే ఆదాయం కూడా మిస్ అయిపోతుంది. అందుకే నాగ్ ఈ షోని వదలడం లేదని తెలుస్తోంది. ఒక షో... రెండు వైపుల నుంచి కాసులు కురిపిస్తోంటే ఎవరు మాత్రం వదులుకొంటారు?