సస్పెన్స్ వీడింది, డేట్ ఫిక్స్ అయ్యింది. విశ్వనటుడు కమల్‌హాసన్ తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. ఫిబ్రవరి 21న ఆ పార్టీ పేరుని ప్రకటిస్తాడు కమల్‌హాసన్. 2017 డిసెంబర్‌లోనే కమల్, కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాడని అందరూ ఎదురుచూశారుగానీ, కొన్ని కారణాలతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
అయితే రాజకీయాల్లోకి వచ్చేసినట్లు ఇప్పటికే కమల్ ప్రకటించుకున్నాడు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు మాత్రం కమల్ దూరంగా ఉండడం గమనించదగ్గ అంశం. దానికి కారణంగా సినిమా పనులతో బిజీగా ఉన్నానని కమల్ చెప్పాడు. కొత్త పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే కమల్ కొన్ని పేర్లను ఫైనలైజ్ చేశాడట. ఓ ఐదు పేర్లు ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయనీ, వాటి స్క్రూటినీకే ఎక్కువ టైమ్ పట్టనుందని సమాచారమ్.
పార్టీ పేరు, గుర్తు ఏ రాజకీయ పార్టీకైనా చాలా ముఖ్యమైన విషయాలు. ఇతర పార్టీలతో వివాదాలుండకూడదు, లీగల్‌గా ఎలాంటి సమస్యలూ రాకూడదు. అందుకే కమల్ ఫిబ్రవరి 21 వరకు టైమ్ తీసుకుంటున్నాడట. ఇంకో వైపున రాజకీయ పార్టీ ప్రకటన చేసేలోపు లైన్‌లో ఉన్న సినిమాల్ని ఓ కొలిక్కి తెచ్చేయాలని కమల్ భావిస్తున్నాడని సమాచారమ్. 'విశ్వరూపం-2' సినిమా పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇటీవలే విదేశాలకు వెల్ళి గ్రాఫిక్స్ పనులు పూర్తి చేయించాడు.
కమల్‌తోపాటు రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసినదే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీ పేరు విషయమై సీరియస్‌గా సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నాడు. అది కూడా అతి త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నాయి.