'రాజ్‌పుత్ కర్ణిసేన' అనే పదం ఈ మధ్య వార్తల్లో ఎంత పాపులర్ పదం అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పద్మావత్' చిత్రానికి సంబంధించి 'రాజ్‌పుత్ కర్ణిసేన' జరిపిన ఆందోళనల్లో భాగంగా, ఈ పదం ఎక్కువగా వినిపించింది. అయితే సినిమా విడుదలయ్యాక వార్తల్లో ఈ మాట వినికిడి కొంచెం తగ్గింది. కానీ తాజాగా మళ్లీ ఈ పదం తెరపైకి వచ్చింది.
ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న 'మణికర్ణిక' చిత్రం విషయమై మళ్లీ రాజ్‌పుత్ కర్ణిసేన వెలుగులోకి వచ్చింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా 'మణికర్ణిక' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌కీ, బ్రిటీష్ వ్యక్తికీ లవ్ అఫైర్‌ని చూపిస్తున్నారంటూ, తద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ రాజస్థాన్ సర్వ బ్రాహ్మణ సంఘం ఆందోళనలు చేస్తోంది. వీరి ఆందోళనలకు రాజ్‌పుత్ కర్ణిసేన మద్దతు పలికింది. దాంతో ఈ ఇద్దరూ ఏకమై 'మణికర్ణిక' సినిమాను వ్యతిరేకిస్తున్నారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని హిందీతో పాటు. దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. కాగా ఈ వివాదాల పర్వంతో 'మణికర్ణిక' సినిమా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'పద్మావత్'లో నటించిందంటూ దీపికాపదుకొనె ముక్కులు, చెవులు కోసేస్తామంటూ కర్ణిసేన ఆందోళనలు చేసింది. దీపిక తల నరికి తెస్తే కోట్లు కుమ్మరిస్తామనీ.. ఒక్కటేమిటీ.. ఇలా ఆ వివాదాలతో సినిమా ఏ రకంగా ముందుకు వెళుతుందోనంటూ అందరిలోనూ ఉత్కంఠ నెలకొనగా, ఎట్టకేలకు 'పద్మావత్' వివాదంపై ఉత్కంఠ తీరింది.
ఈ వివాదం నుండి ఇంకా తేరుకోకుండానే, ఇప్పుడు తాజాగా 'మణికర్ణిక' వచ్చి చేరింది ఆ వివాదాల లిస్టులో. మరి ఈ తాజా వివాదాలు కేవలం పబ్లిసిటీ వరకే ఆగుతాయా లేక మరింత ఉదృతమవుతాయా అనేది వేచి చూడాలి.