ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది కరాటే కల్యాణీ. ఓ యూ ట్యూబ్ స్టార్ పై నడి రోడ్డుమీద చేయి చేసుకుని కలకలం సృష్టించి రెండు రోజులు కాకముందే... మరోసారి కరాటే కల్యాణీ వార్తల్లోకెక్కింది.
కరాటే కల్యాణీ కొంతమంది పిల్లల్ని అక్రమంగా తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారన్న ఫిర్యాదుతో ఆమె ఇంట్లో... శిశు సంరక్షణ శాఖ అధికారులు దాడులు చేశారు. పదకొండేళ్ల బాలుడు, మూడు నెలల చిన్నారి.. కరాటే కల్యాణీ ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయమై ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ పిల్లలు ఎవరు? కరాటే కల్యాణీకీ వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఆరా తీస్తున్నారు. సోదాలు చేసే సమయంలో కల్యాణీ.. ఇంట్లో లేరు. కరాటే కల్యాణీకి పిల్లలంటే ఇష్టమని అందుకే వాళ్లని పెంచుకుంటున్నారని ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఎవరినైనా దత్తత తీసుకుంటే చట్టపరంగా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అయితే అవేం చేయకుండా.. పిల్లల్ని తీసుకొస్తే నేరంగా పరిగణిస్తారు. ఆ పిల్లల తాలుకూ తల్లిదండ్రులు ఎవరు? వాళ్లు ఇష్టపూర్వకంగానే కల్యాణీకి తమ పిల్లల్ని అప్పగించారా? లేదంటే కల్యాణీ బలవంతంగా తీసుకొచ్చిందా? అనే విషయమై ఇప్పుడు దర్యాప్తు మొదలెట్టారు. ఈ విషయంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే గనుక.. కల్యాణీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.