'పద్మావతి' సినిమా అనుకున్నప్పటి నుండీ వివాదాలే. వివాదాల ద్వారా ఈ సినిమా స్టోరీపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఈ సినిమా చూడాలని అటు బాలీవుడ్ ప్రేక్షకులే కాదు, టాలీవుడ్ నుండి కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికంతటికీ అసలు కారణం ఈ సినిమా రాజ్‌పుత్ రాణి పద్మిని యదార్ధ జీవిత గాధ కావడమే. రాజ్‌పుత్ రాణి పద్మిని పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. రాజా రావన్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు.
అయితే రాణి పద్మినికీ, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రకీ మధ్య అసభ్యకరమైన సన్నివేశాలున్నాయంటూ ఆరోపిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు రాజ్‌పుత్ కర్ణి సేన. సినిమా విడుదలను ఆపేస్తామని వారు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు మొర్రో అని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మొత్తుకుంటున్నా ఈ ఆందోళనలు ఆగడం లేదు. ఈ సినిమాలో నటించిందని దీపికా పదుకొనె ముక్కు కోసేస్తామనీ హెచ్చరించారు కర్ణి సేన.
తాజాగా క్షత్రియ సేన అంటూ..మరో వర్గం సెన్సేషనల్‌గా వివాదం తలెత్తారు. అందేంటంటే, ఈ సినిమాని తెరకెక్కించినందుకు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తలకు 5 కోట్లు వెల కట్టారు. ఆయన తలను నరికి తెచ్చిన వారికి అక్షరాలా 5 కోట్లు బహుమతి ప్రకటించారు. దాంతో వివాదం మరింత ఉదృతమైంది. ఈ వివాదాలు ఎక్కడిదాకా చేరతాయో తెలీదు కానీ, సినిమా విడుదల డేట్ మాత్రం డిశంబర్ 1. ఈ డేట్‌కి సినిమా విడుదలవుతుందో లేదో అంటూ సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ నుండి ఎంత పోజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చినా కానీ ఈ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. సరికదా తాజాగా తలెత్తిన ఈ భన్సాలీ తలకు 5 కోట్లు వివాదం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.