ఈ దీపావళికి గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కార్తి నటించిన 'ఖైదీ' సినిమా. ఆ రోజు చెప్పుకోదగ్గ మరో స్ట్రెయిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ అయితే రాబట్టింది కానీ, నిలబడడం అంత సులువైన పని కాదనుకున్నాడు ఈ సినిమా విషయంలో. ఎందుకంటే హీరోయిన్ లేదు. పాటలు లేవు. ఏ కమర్షియల్ అంశమూ లేదు. ముఖ్యంగా మాస్‌ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఈ సినిమాలో లేకపోవడం వల్ల ఏదో అన్ని డబ్బింగ్ సినిమాల్లానే వస్తుందిలే.. వెళుతుందిలే అనుకున్నారంతా. కానీ, సినిమాకి పోజిటివ్ టాక్ వచ్చింది.
కథలో విషయం కమర్షియల్ ఇష్యూస్‌ని పక్కన పెట్టేసేలా చేసింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆదరించడంతో, మంచి వసూళ్లు రాబట్టింది. తమిళంలో ఎలాగూ సినిమా సూపర్ హిట్. కానీ, తెలుగులో మంచి విజయం సాధించడం విశేషం. ఇదే రోజు ఇళయదళపతి విజయ్, సౌత్ క్వీన్ నయనతార కాంబినేషన్‌లో 'బిగిల్' (తెలుగులో 'విజిల్') కూడా విడుదలైంది. కానీ, ఈ సినిమా కన్నా కార్తి సినిమాకే మంచి వసూళ్లు వచ్చాయి.
ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో ఇంత బెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా 'ఖైదీ'నే అంటూ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో సాగే సినిమా ఇది. ఈ సెంటిమెంట్, కార్తీపై చిత్రీకరించిన భారీ యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఇప్పటికీ పోజిటివ్ రన్ రేట్‌తో 'ఖైదీ' నడుస్తుండడం విశేషం.