బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడే ఓ రేంజులో పాపులర్ అయిపోయాడు కౌశల్. గెలిచిన తరవాతి సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు. కౌశల్ ఆర్మీ అంటే ఓ గ్రూపునే ముందుండి నడిపిస్తున్నాడు కౌశల్. బిగ్ బాస్ 2 ద్వారా వచ్చిన 50 లక్షల్ని కాన్సర్ బాధితుల సహాయార్థం ఇస్తానని అప్పట్లోనే మాటిచ్చాడు. అయితే ఇప్పటి వరకూ ఆడబ్బులు కాన్సర్ బాధితుల కోసం ఇవ్వలేదట. ఈ విషయాన్ని కౌశల్ ఆర్మీలోని కీలక సభ్యులే చెప్పారు.
కౌశల్ వ్యవహార తీరు నచ్చక, కౌశల్ ఆర్మీలోని కొంతమంది కీలక సభ్యులు అందులోంచి బయటకు వచ్చేశారు. కౌశల్‌పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఈ 50 లక్షల వ్యవహారం. గెలిచిన వెంటనే ఆ డబ్బుల్ని... కాన్సర్ బాధితులకు ఇస్తానన్న కౌశల్, ఇప్పుడు ఆ విషయాన్ని అడిగితే 'మీకెందుకు?' అన్నట్టు మాట్లాడుతున్నాడని, ఒక్కోసారి 'ఆ డబ్బులింకా నా చేతికి అందలేదు' అని బుకాయిస్తున్నాడన్నది కౌశల్ ఆర్మీ వాదన.
కౌశల్ ఫౌండేషన్ పేరుతో లక్షలు లక్షలు విరాళాలుగా సేకరించామని, ఆ డబ్బు ఏం చేశాడో కూడా కౌశల్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కౌశల్ ని గెలిపించుకోవాలన్న ధ్యేయంతో కౌశల్ ఆర్మీ స్థాపించి, అహర్నిశలు కష్టపడితే, గెలిచిన తరవాత కౌశల్ ఆర్మీని గానీ, అందుకోసం పాటు పడినవాళ్లని గానీ కౌశల్ గుర్తించలేదని, పైగా తమని వేధిస్తున్నాడని కౌశల్ ఆర్మీలోని కీలక సభ్యులు ఆరోపిస్తున్నారు. వీటిపై కౌశల్ ఎలా స్పందిస్తాడో మరి.