కేసీఆర్.. తెలంగాణ జాతిపిత. తెలంగాణ రూపు రేఖల్ని మార్చి, బంగరు బాట వేసిన తిరుగులేని నేత. తెలంగాణ దిక్చూచీ. ఆయన కథని వెండి తెరపై చూపించాలని చాలామంది భావించారు. కేసీఆర్ బయోపిక్ తీస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. కానీ ఆ కథలేవీ సెట్స్‌పైకి వెళ్లలేదు. మధుర శ్రీధర్ కూడా కేసీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పినవారే. ఆయన మాత్రం ఈ బయోపిక్‌పై సీరియస్ గానే దృష్టి పెట్టారు. కథ కూడా రెడీ అయిపోయింది. కేసీఆర్ కథని పాన్ ఇండియా స్థాయిలో తీయాలన్నది మధుర శ్రీధర్ ఆలోచన. అందుకు తగిన తారల్ని వెదుకి పట్టుకునే పనిలో ఉన్నారు.
ఈ సినిమాకి 20 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. మధుర శ్రీధర్ ఇప్పటి వరకూ చిన్న సినిమాలే తీస్తూ వచ్చారు. ఆయన బ్రాండ్ కూడా అదే. 20 కోట్లతో సినిమా అంటే తగినంత కసరత్తు కావాలి. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ బయోపిక్‌కి దేశమంతా మెచ్చుకునే తీస్తానని అంటున్నారాయన. అదే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మారిందిప్పుడు.
కేసీఆర్ బయోపిక్ మాత్రమే కాదు, తెలంగాణ జీవితం, జీవనం ఆవిష్కృతమయ్యేలా, ఇక్కడి సంస్కృతి ప్రపంచానికి తెలిసేలా చిన్న చిన్న సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా దొరసాని అనే సినిమా తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఆయన్నుంచి మరిన్ని రానున్నాయి.