తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ జోరు అలా ఇలా లేదు. సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నీ మధ్యనే 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్‌స్టార్ సరసన ఇద్దరు భామలు నటిస్తున్నారు. వారిలో ఒకరు నయనతార కాగా, మరో ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
తాజాగా వీరి పేర్లను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్. నయనతార, రజనీ కాంబినేషన్‌లో గతంలో రెండు చిత్రాలు వచ్చాయి. కానీ కీర్తి సురేష్‌కి సూపర్‌స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. హీరోయిన్‌గా ఇంత తక్కువ టైంలోనే సూపర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే కీర్తి సురేష్ పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోతోంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం అనీ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, తెలుగులో 'మహానటి' తర్వాత కీర్తిసురేష్ ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది. తమిళంలో కీర్తి చేతిలో బిగ్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. అలాగే త్వరలో మలయాళంలోనూ అడుగుపెట్టబోతోంది. ఇటీవలే మల్లూవుడ్‌లో ఓ మూవీకి సైన్ చేసింది కీర్తిసురేష్.