'బాహుబలి' సినిమా తర్వాత ఇంకో సినిమా గురించి ఆ స్థాయిలో మాట్లాడుకున్నారంటే అది ఖచ్చితంగా 'కేజీఎఫ్' సినిమానే. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకోవడంతో పాటు, కన్నడ సినిమా స్టామినాని ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా ఇది. ఇంత గొప్ప సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈయన 'కేజీఎఫ్ 2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ప్రశాంత్ నీల్ తదుపరి చేయబోయే సినిమా విషయమై ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది.
ప్రశాంత్ నీల్ తదుపరి ఓ తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నాడట. ఈ వార్త అలా మార్కెట్లోకి రాగానే, ఆ హీరో మరెవరో కాదు, ప్రబాసే అయ్యుంటాడని అనుకున్నారంతా. కానీ అది ప్రబాస్ కాదట. ఎన్టీఆర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ మూవీస్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారనీ తెలుస్తోంది. ఆల్రెడీ మైత్రీ మూవీస్ సంస్థ ప్రశాంత్‌కి ఓ బిగ్ అమౌంట్ ఆఫర్ చేశారట కూడా. అయితే ఇది ఉత్త ప్రచారమేనా.? లేక నిజంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా.? అని తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.