తారలవన్నీ మేడి పండు జీవితాలే. పైకి అంతా బాగానే ఉన్నట్టుంటుంది. లోలోపల ఎన్నో విషాదాలు. విలయాలు. తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తుంటారు. వాటిని ఎదుర్కోలేక, ఒకానొక బలహీనమైన క్షణంలో, ఆత్మహత్య లాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అందుకు తాజా ఉదాహరణ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఈ యువ కథానాయకుడు, ముఫ్ఫై నాలుగేళ్లకే తనువు చాలించాడు. నిజానికి ప్రతీవాళ్లకూ ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని దాటుకుని రావడంలోనే జీవిత పరమార్థం దాగుంది. ఖుష్బూకీ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయట. ఓ క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందట.
అయితే.. ఆ క్షణంలోనే, జీవితంపై పోరాడాలని నిర్ణయించుకున్నానని, సవాళ్లని స్వీకరిస్తూ ముందడుగు వేశానని చెబుతోంది. ''నాకూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. జీవితంలో అన్నీ కోల్పోయి, తీవ్రమైన మానసిన ఒత్తిడిని అనుభవించా. ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించింది. కానీ నా స్నేహితుల సహకారంతో మళ్లీ నిలదొక్కుకున్నా. నేను చావడం కాదు, నన్ను కృంగదీయాలనుకుంటున్న సమస్యల్ని చంపాలి అనుకున్నా. అప్పటి నుంచీ నా జీవితం తిరిగి ప్రారంభమైంది'' అని చెప్పుకొచ్చింది ఖుష్బూ. ఇదే ఆలోచన సుశాంత్ సింగ్ కీ వచ్చుంటే, బాలీవుడ్ ఇంతటి విషాదాన్ని చూసి ఉండేదే కాదు.