రాజమౌళి.. తెలుగులోనే కాదు, ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. ఆయన పట్టిందల్లా బంగారమే. సినిమాకి సరికొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన దర్శకుడు. తనతో సినిమా అంటే అటు హీరోలకూ, ఇటు నిర్మాతలకూ బంపర్ బొనాంజానే. కాకపోతే.. రాజమౌళిని ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. సినిమా సినిమాకీ ఆ సెంటిమెంట్ బలపడుతోంది.. భయపెడుతోంది.
రాజమౌళి సినిమాలేవీ ఓ పట్టాన పూర్తికావు. సుదీర్ఘంగా సాగుతూనే ఉంటాయి. పెద్దపెద్ద ప్రాజెక్టుల్ని భుజాన వేసుకున్నప్పుడు అలాంటి అవరోధాలు చాలాసార్లు ఎదురయ్యాయి. బాహుబలి విషయంలోనే చూడండి. షూటింగ్ ఎప్పుడు పూర్తవాల్సిందో? విడుదల చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` విషయంలోనూ అదే జరుగుతుంది. నిజానికి ఈనెలలోనే `ఆర్.ఆర్.ఆర్` విడుదల కావాలి. అది కాస్త 2021 జనవరికి వెళ్లిపోయింది. ఇప్పుడు 2021 వేసవి అంటున్నారు. అప్పటికీ ఈ సినిమా రాదని చాలామందిలో అనుమానం. `ఆర్.ఆర్.ఆర్` మొదలెట్టినప్పటి నుంచీ ఏదో ఓ సమస్య. చరణ్, ఎన్టీఆర్... ఇద్దరూ గాయాలబారీన పడ్డారు. దాంతో షూటింకి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కరోనా సమస్య వెంటాడుతోంది. ఇవన్నీ దాటుకుని, 2021 వేసవిలో ఈ సినిమా విడుదల అవ్వడం చాలా కష్టం అంటున్నారంతా. సోమవారం నుంచి `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మొదలెడతారని ప్రచారం జరిగింది. అయితే ఈరోజు కూడా షూటింగ్ మొదలవ్వలేదు. జులైకి గానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లదని టాక్. ఇలాగైతే రాజమౌళి సినిమాని 2022 సంక్రాంతికే చూడగలమేమో..?