రాజమౌళిని అభిమానులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటుంటారు. ఎందుకంటే... ప్రతీ సన్నివేశాన్నీ అమరశిల్పి జక్కన్నలా చెక్కుతూ ఉంటాడని. ఏదీ ఓ పట్టాన ఓకే చేయడు. అందుకే ఆయన సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యమైనా... అద్భుతాలుగా నిలిచిపోతాయి కాబట్టి, అదేం పెద్ద కంప్లైంట్ కాదు. ఇప్పుడు మరో దర్శకుడు కొరటాల శివ... ఈ విషయంలో జక్కన్ననే మించిపోయాడట. ప్రస్తుతం ఆయన చిరంజీవిని `ఆచార్య` గా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అన్ లాక్ తరవాత.. షూటింగులు మొదలైనా, `ఆచార్య` మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.
చిరంజీవి నుంచి ఇంకా అనుమతులు రాలేదని, అందుకే షూటింగ్ మొదలు కాలేదని టాక్ వినిపిస్తోంది. నిజానికి.... కొరటాల శివ ఇంకా స్క్రిప్టు రాస్తూనే ఉన్నాడట. రామ్ చరణ్ - చిరంజీవి కాంబినేషన్‌లో తీయాల్సిన సన్నివేశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని టాక్. ఇది వరకే ఓ వెర్షన్ రాసినా, దానికంటే బాగా రావాలన్న ఉద్దేశంతో - వాటిని మళ్లీ తిరగరాస్తున్నాడని, ఆ సన్నివేశాలు రాయడం పూర్తయ్యేంత వరకూ... సినిమా షూటింగ్ మొదలు కాదని తెలుస్తోంది. అంటే.. ఇప్పుడు వెయిటింగ్ చిరు, చరణ్‌లదన్నమాట. ఎలాగూ ఈ సినిమాసంక్రాంతి రాదు. 2021 వేసవికి వస్తే రావొచ్చు. దానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి, షూటింగ్ విషయంలో తొందరపడడం లేదేమో.