కోట శ్రీనివాసరావు - బ్రహ్మానందం.. ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రసీమని కొన్నాళ్ల పాటు ఏలేశారు. హాస్యనటుడిగా బ్రహ్మానందం తనదైన ముద్ర వేస్తే - కోట శ్రీనివాసరావు అద్భుతమైన విలనీతో.. మెప్పించారు. ఇద్దరూ చేయని పాత్ర లేదు. బ్రహ్మానందం వేయి సినిమాలు దాటేస్తే... కోట అందుకు అటూ ఇటూగా ఉన్నారు. ఇద్దరూ ఉద్దండులే. కానీ.. దురదృష్టం ఏమిటంటే.. ఇద్దరూ ఇప్పుడు ఖాళీనే.
ఖాళీ అంటే మామూలు ఖాళీ కాదు. ఎవరు ఏ అవకాశం ఇస్తారా? అని ఎదురుచూస్తూ కూర్చున్నంత ఖాళీ. అంతేకాదు.. `మీ సినిమాలో మాకు అవకాశం ఇస్తారా` అంటూ దర్శకులకు, నిర్మాతలకు ఫోన్లు చేసి అడుగుతున్నార్ట. ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు సైతం ఒప్పుకున్నారు. `ఏళ్ల తరబడి నటిస్తూనే ఉన్నాను. నటన తప్ప మరేం తెలీదు. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోలేక... అవకాశాలు అడుగుతున్నా` అని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం పరిస్థితీ ఇంచుమించుగా ఇంతే. తనకు బాగా సన్నిహితులైన దర్శకులకు ఫ్రెండ్లీ రిక్వెస్లు పెడుతున్నార్ట. సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడబడితే అక్కడ.. కొత్తతరం కదం తొక్కుతోంది. దాంతో సీనియర్లు సైడ్ అయిపోవాల్సివస్తోంది. కాకపోతే... తమదైన రోజున, ఓ మంచి పాత్ర దొరికితే అందులో విశ్వరూపం చూపించే సత్తా వీరిద్దరికీ ఉంది. అలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందో?